హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. బేగంపేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలానగర్ బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, జెబిఎస్, కార్కానా, ప్యాట్నీ, సికింద్రాబాద్, చిలకలగూడ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. తూర్పు మధ్యప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న చత్తీస్ గఢ్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
మరో రెండు రోజుల వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్ వనపర్తి, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.