ఊహించిందే జరిగింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రాజ్ భవన్‌కి వెళ్లి అక్కడ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను, గవర్నర్‌తో చర్చించిన అంశాలను వెల్లడించేందుకు కొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ వేదికగా ఈ మీడియా సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయం అనే వార్తలే నిజమయ్యాయి.
తెలంగాణ కేబినెట్ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు కానుండగా ఆ తర్వాత నుంచి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి కేసీఆరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.