Mahalakshmi Gas Scheme: తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పధకాల హామీని ప్రధానంగా ప్రజల ముందు ఉంచింది. అందులో అతి ముఖ్యమైంది 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పంపిణీ. మరి ఈ పధకానికి లబ్దిదారులు ఎవరనేది ఆసలు ప్రశ్న. ఇప్పుడది తేల్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ పధకానికి అర్హులెవరో తెలుసుకుందాం..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో రెండింటిని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చు 10 లక్షలకు పెంపు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీ పధకాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ పధకంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈ పధకానికి లబ్దిదారులెవరో తేల్చేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకం కోసం కనిష్టంగా 2,225 కోట్లు, గరిష్టంగా 4,450 కోట్లు ఖర్చవుతాయనేది అంచనా.
ఈ రెండు ప్రతిపాదనల్లో మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేనివారిలో అర్హుల్ని గుర్తించి ఎంపిక చేయడం. ఇక రెండవ ప్రతిపాదన రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హుల్ని గుర్తించడం. రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1.20 కోట్లు. ప్రతి నెలా రీఫిల్ చేసుకునేవారి సంఖ్య ఇందులో 44 శాతముంటుందని తెలుస్తోంది. అంటే 52 లక్షలమందికి నెలకు ఒక సిలెండర్ అవసరమౌతుంది.
ఇక రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 89.99 లక్షలు. మొదటి ప్రతిపాదన పరిగణలో తీసుకుంటే దాదాపుగా కోటి కనెక్షన్లకు 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ ఇవ్వాల్సి వస్తుంది. పథకాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో అమలు చేయవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ప్రకారమైతే లబ్దిదారుల్ని గుర్తించేందుకు సమయం పట్టవచ్చు. అంటే ఈ పధకం అమలుకు ఆలస్యం కావచ్చు.
ప్రస్తుతం గ్యాస్ సిలెండర్ ధర తెలంగాణలో 955 రూపాయలైతే దానిపై రాయితీ 40 రూపాయలు వస్తోంది. అదే ఉజ్వల్ సిలెండర్‌కు 340 రూపాయలు రాయితీ లభిస్తోంది. ఉజ్వల్ కనెక్షన్లు రాష్ట్రంలో 11.58 లక్షలున్నాయి. రాయితీ వదులుకున్నవారి సంఖ్య రాష్ట్రంలో 4.2 లక్షలుగా ఉంది. ఈ నేపధ్యంలో ఎంతమందిని 500 రూపాయల గ్యాస్ సిలెండర్ పధకానికి ఎంపిక చేస్తారనేది తేలాల్సి ఉంది. 500 రూపాయల గ్యాస్ సిలెండర్ ఏడాదికి ఆరు ఇస్తారా 12 ఇస్తారా అనేది ఇంకా ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మొత్తానికి రేషన్ కార్డు ప్రాతిపదికన 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్ అందే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook