Revanth Reddy Demands to Remove Dharani Portal : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల బృందం సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ని కలిసింది. సీఎస్ సోమేష్ కుమార్ తో భేటీ అయిన టి కాంగ్రెస్ నేతల బృందం.. ఈ సందర్భంగా తెలంగాణలో భూ సమస్యలు పెరిగిపోయాయని, తక్షణనే వాటిని పరిష్కరించాలని కోరుతూ మెమోరండం అందజేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మొదటి నుంచీ ప్రకటిస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్తో భేటీలోనూ అదే అంశాన్ని తొలి ప్రధాన్యతగా ప్రస్తావించారు. తెలంగాణలో రైతుల భుముల సమస్యకు కారణం అవుతున్న ధరణిని రద్దు చేసి పాత పద్ధతి తీసుకురావాలని రేవంత్ రెడ్డి కోరారు. నిషేదిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు మేలు చేసే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని అర్హులకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఎలాంటి భరోసా లేక కౌలు రౌతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అన్నారు. అందుకే కౌతు రౌతుల చట్టాన్ని అమలు చేసి వారికి కూడా ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ సోమేష్ కుమార్ని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ తదితరులు ఉన్నారు.