Telangana Govt Jobs Notifications: హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ జాతరకు బెల్ మోగింది. మళ్లీ నిరుద్యోగుల్లో ఆశల దీపం చిగురించింది. కోచింగ్ సెంటర్లు కళకళలాడబోతున్నాయి. నోటిఫికేషన్ల కోసం యేళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకుల్లో సందడి మొదలయ్యింది. దీంతో, ఇప్పుడు తెలంగాణలో గడిచిన వారం రోజులుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల గురించే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న లెక్కలు సాగుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించినట్లు ఉద్యోగ నియామకాలు ఎప్పటిలోగా పూర్తవుతాయన్న అంచనాలపై ఎవరికి వారు ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న మొత్తం 91వేల 142 ఉద్యోగాలు భర్తీచేయబోతున్నట్లు ఈనెల 9వ తేదీన అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసలు ఆ ప్రకటననే ఓ సంచలనంగా తయారు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటనకు ముందు రోజు వనపర్తిలో పర్యటించారు. ఆ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు చూడాలని, తాను అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నానని ప్రకటించారు. దీంతో, అసెంబ్లీలో కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారో అన్న ఉత్కంఠ తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. చాలామంది నిరుద్యోగులు ఆరోజు రాత్రి నిద్రకూడా పోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, కేసీఆర్ అసెంబ్లీలో చేసే ప్రకటన ఏంటా అన్న ఆలోచనల్లో మునిగిపోయారు.
గడిచిన రోజు ప్రకటించినట్లే కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణలో మిగిలిన ఖాళీలు, నోటిఫికేషన్ల గురించి ఆ ప్రకటనను స్వయంగా చదివి వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల 142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80 వేల 39 ఉద్యోగాలకు ఇవాళే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటినుంచి తెలంగాణలో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి అధికారి వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 5 శాతం ఉద్యోగాలు మాత్రమే స్థానికేతరులకు వస్తాయని అందులోనూ ఓపెన్ కోటాలో మరికొందరు తెలంగాణ వాసులకు ఉద్యోగాలు వస్తాయని అంటే, కనీసం 98శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేసీఆర్ గర్వంగా ప్రకటించారు.
అయితే, కేసీఆర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రకటనపై విపక్షాలు పెదవి విరిచాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా.. ఇతర నేతలు కూడా కేసీఆర్ మాయా లెక్కలు చెప్పాడంటూ మండిపడ్డారు. వాస్తవానికి ఖాళీగా ఉన్న ఉద్యోగాల లెక్కలు చెప్పకుండా, మరోసారి నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీలో నిరుద్యోగులకు శుభవార్త చెబుతానని ఊరించిన కేసీఆర్.. అసలు విషయం మరిచారని గుర్తు చేశారు. నిరుద్యోగభృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానం ఏమైపోయిందని ప్రశ్నించారు. 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు ఏడు సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. మరోసారి కేసీఆర్ అసలు స్వరూపం బయటపడిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వాస్తవానికి బిశ్వాస్ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే.. తెలంగాణలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ కమిటీని తెలంగాణ ప్రభుత్వమే నియమించింది. నిరుద్యోగులకు లెక్క చెబుతామన్న ఉద్దేశ్యంతో సర్కారు బిశ్వాస్ కమిటీని నియమించింది. ఆ కమిటీ తెలంగాణలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో అవసరమైన ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీగా ఉన్న పోస్టులను లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కనీసం ఆ కమిటీ నివేదికను కూడా బుట్టదాఖలు చేసిన కేసీఆర్.. అసలు తెలంగాణలో 80 వేల 39 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటన చేయడం అందరినీ మోసం చేయడమే అని విపక్షాలు నిలదీస్తున్నాయి.
ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అనుకుంటే, మరోవైపు కూడా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక.. రాష్ట్రం ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటైన నియామకాల అంశం నిరుద్యోగులకు కల్పతరువు అవుతుందని అంతా భావించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాలు వీలైనంత తొందరగా సాకారం అవుతాయని నియామకాలు వస్తే తెలంగాణలో యువత ఉన్నతమైన స్థితికి చేరుకుంటారని అందరూ ఊహించారు. కానీ, ఉద్యోగ నియామకాల విషయంలో పురోగతి లేకపోవడంతో బలవన్మరణాలు కూడా సంభవించాయి. అనేక మంది సూసైడ్ నోట్లు రాసి మరీ తనువు చాలించారు. తమ మరణం తర్వాత అయినా తెలంగాణప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ ఇటువైపు ఆలోచించాలని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రాణాలు పోకముందే ఉద్యోగాలు ఇవ్వాలని కన్నీటితో సూసైడ్ నోట్లలో వేడుకున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఒక ఎత్తయితే, వాళ్ల మరణంతో కుంగిపోయి కుటుంబసభ్యులు బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కంటతడి పెట్టించింది. కొన్ని జిల్లాల్లో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆ కుటుంబాల్లో తీరని చిచ్చు పెట్టాయి. ఓ చోట నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే, ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు పోయాడన్న దుఃఖంలో అతని తండ్రి మానసికంగా కుంగిపోయాడు. చివరకు తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లాలో.. ఎంత చదివినా ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటం లేదన్న బెంగతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణంతో కుంగిపోయిన ఆయన భార్య కూడా కొంతకాలానికి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో, వాళ్ల ఆరేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు.
ఇక, తాజా పరిస్థితి చూస్తే అదేరోజు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని, నోటిఫికేషన్లు వెలువడుతాయని అసెంబ్లీలో ప్రకటన రోజే కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఇంకా నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ మొదలు కాలేదు. డిపార్ట్‌మెంట్ల వారీగా ఖాళీలు, నోటిఫికేషన్లకు సంబంధించిన కసరత్తు ఇంకా కొనసాగుతుందని చెబుతున్నారు. ఈసారి కేసీఆర్ ( CM KCR about govt jobs notifications) స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన దృష్ట్యా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియామకాల ప్రక్రియ చేపడుతోందని, ఖాళీలు అసలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. అందుకే నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయని వాదిస్తున్నారు. సాధారణంగా ఒకేసారి పలు నోటిఫికేషన్లు, వేర్వేరు ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడితే చాలామంది నిరుద్యోగులు ఒకటికి మించి ఎక్కువ పోస్టులకు దరఖాస్తులు చేసుకుంటారు. వీరిలో కొందరు రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికవుతారు. వాటిలో తమకు నచ్చిన ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా జాబ్‌లను వదిలేస్తారు. ఈ కారణాలతో కొన్ని డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. అయితే, మిగతావాళ్లకు ఆ పోస్టుల్లో అవకాశం దక్కడం లేదు. ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఉద్యోగార్థులకు తదుపరి నోటిఫికేషన్ దాకా అవకాశం దక్కడం లేదు. ఈసారి మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా, నివారణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే నియామక ప్రక్రియ ఇంకామొదలు కాలేదని, నోటిఫికేషన్ల (TS jobs notifications) జారీ ఆలస్యమవుతోందని అంటున్నారు.
Also read : Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం
Also read : MP Bandi Sanjay: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి 'స్టడీ సర్కిల్' ఏర్పాటు చేయండి: కేసీఆర్‌కు సంజయ్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook