తెలంగాణలో ఆగస్టు 1వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నేతృత్వంలోని సీనియర్ అధికారుల బృందం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సూచించింది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లను వారి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం చట్టరీత్యా కుదిరే పని కాదని, న్యాయస్థానాలు కూడా అందుకు అంగీకరించబోవని అధికారుల బృందం ముఖ్యమంత్రికి స్పష్టంచేసింది.
సర్పంచ్‌ల పదవీ కాలం ముగింపు అనంతరం గ్రామ పంచాయతీల పాలనపై ప్రభుత్వం అవలంభించబోయే విధివిధానాల కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నివేదిక ఇచ్చారు. ఆగస్టు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే.
సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించేందుకు ప్రభుత్వం ముందున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో దాదాపు ఎనిమిది గంటలపాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కోర్టు కేసుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతున్నందున అధికారుల సూచనలు, న్యాయ సలహాల మేరకు గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు వచ్చే వరకు వారి స్థానంలో అధికారులనే స్పెషల్ ఆఫీసర్స్‌గా నియమించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.
సర్పంచ్‌లు లేని కారణంగా అభివృద్ధి కుంటుపడకూడదనే ఉద్దేశంతో పంచాయతీల అభివృద్ధి కోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.