TRS Leaders Changing Party: కారు దిగుతున్న గులాబీ నేతలు.. డేంజర్ జోన్‌లోకి టీఆర్ఎస్ పార్టీ ?

TRS Leaders To Join BJP, Congress: టీఆర్ఎస్ పార్టీ కొద్దికొద్దిగా డేంజర్ జోన్ లోకి వెళ్తుందా ? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్టీలో కీలక నేతలు పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారా ? పార్టీలో ఒకప్పటి చేరికలే ఇప్పుడు చేటు తీసుకొస్తున్నాయా ? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు వలసలు పెరగనున్నాయా ? టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు ఏమనుకుంటున్నారు ? పబ్లిక్ టాక్ ఏంటి ? 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 06:06 PM IST
  • టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది ?
  • ఏయే నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ?
  • చేరికలతో వచ్చిన ఒకప్పటి బలమే ఇప్పుడు వీక్‌నెస్ అవుతోందా ?
TRS Leaders Changing Party: కారు దిగుతున్న గులాబీ నేతలు.. డేంజర్ జోన్‌లోకి టీఆర్ఎస్ పార్టీ ?

TRS Leaders To Join BJP, Congress ?: తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు కావడంతో రాజకీయ పార్టీలలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్‌తో గులాబీ పార్టీకి మొగ్గుచూపిన నేతలు కారణాలేంటో బయటకు చెప్పకున్నా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం రాజకీయ పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నుండి నాయకులను ఎంతమంది వచ్చిన పుష్పక విమానం లాగా  టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు. చివరికి గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టిడిపి పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని పార్టీల నుండి ముఖ్యమైన నాయకులు రావడంతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలమైన పార్టీగా ఏర్పడింది. 2018 ఎన్నికల తరువాత టిఆర్ఎస్ పరిపాలన మీద ప్రజలలో అసంతృప్తి పెరిగిపోయింది. మరోవైపు పార్టీలో కింది స్థాయి నాయకుల అభిప్రాయానికి విలువలేదని పార్టీని వీడుతున్న నేతలు చెప్తుండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న నాయకులు కూడా బహిరంగంగా ఒప్పుకోకపోయినప్పటికి తెరవెనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబం ఆధిపత్య వైఖరితో సీనియర్ నాయకులు కూడా అవమానాలు పడాలిసి వస్తోందనే విమర్శలున్నాయి. చివరికి ప్రగతి భవన్‌లోకి అపాయింట్మెంట్ లేకపోతే మంత్రులను కూడా అనుమతించరని మాజీ టిఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ చెప్పడాన్ని బట్టి టిఆర్ఎస్‌లో పార్టీ నేతలకు ఉన్న విలువ ఏంటో ఇట్టే అర్థం అవుతోంది.
 
అధికారంలో ఉన్న పార్టీ కావడంతో చాలా మంది నేతలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటికే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలతో పొసగక అంతర్గత కోట్లాటలు జరుగుతున్నాయి. ఎదో ఊహించుకొని పార్టీలో చేరిన నేతలు తమకు ప్రాధాన్యం లేక డమ్మీలుగా మారిపోయామని అనుచరుల  దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో ఆశావహుల లిస్ట్ ఎక్కువ కావడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది. పార్టీ మారితే ఎదో ఒక పదవి దక్కుతుందని ఆశపడ్డ చాలా మంది నేతలు ఎలాంటి పదవి లేకపోవడంతో పార్టీని విడాలా లేక టిఆర్ఎస్ పార్టీలో కొనసాగాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. 

ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతలకు ప్రస్తుత ప్రజాప్రతినిధులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేల ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ కేటీఆర్ స్వయంగా వెళ్లి బుజ్జగించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోనే తుమ్మల వర్సెస్ కందాల పోరు చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పాలేరు నియోజకవర్గంలో ఆధిపత్య పొరుతో కార్యకర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అధిష్టానం ఎన్నిసార్లు సర్ది చెప్పిన అంతర్గత పోరు తగ్గడం లేదు.

మరో నియోజకవర్గం కొల్హాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే జూపల్లి వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ మధ్య తీవ్ర స్థాయిలో వర్గ పోరు నడుస్తోంది. ఒకరి అవినీతి మీద ఒకరు బహిరంగ చర్చకు సవాల్ విసురుకున్నారు. కేటీఆర్ స్వయంగా వెళ్లి జూపల్లితో చర్చించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి 2018 ఎన్నికల్లో ఓటమి పాలు కావడం తరువాత పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఇంకా టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో తీగల వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ ఎంపీ మలోతు కవిత.. ఇలా ఒకటి రెండు నియోజకవర్గాలలో కాదు చాలా నియోజకవర్గాలలో వర్గపోరుతో టిఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మరోవైపు ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో చాలామందికి మళ్ళీ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుండటంతో నేతలు పార్టీని వదిలి పక్క పార్టీల వైపు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడుతుండడంతో టిఆర్ఎస్ పార్టీని వీడి తమకు సీటు కన్ఫర్మ్ అనుకున్న పార్టీలోకి జంప్ చేయడానికి సదరు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు పార్టీలు మారితే విలువ ఉండదని క్యాడర్‌లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అందుకే ఇప్పుడే పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బడంగ్‌పెట్ మేయర్ పారిజాతం కూడా టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కార్పొరేటర్లే కాదు చాలామంది ద్వితీయశ్రేణి నాయకులు కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. 

చాలామంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం, కేసీఆర్‌కు వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టం లేక ఎవరు బయటపడడం లేదు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు ఉండరని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాలలో చాణక్యుడిగా పేరుపొందిన కేసీఆర్ పార్టీలోని అంతర్గత సమస్యల మీద ఇంకా ఫోకస్ చేసినట్టుగా లేదు. పరిపాలన, థర్డ్ ఫ్రంట్ మీద కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు కేటీఆర్ ఒక్కడే చూస్తున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, క్షేత్రస్థాయిలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్టానంకు చెప్పుకోలేక ఎమ్మెల్యేలు, నాయకులు సతమతమవుతున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరుపై టిఆర్ఎస్ పార్టీ (TRS Party) దృష్టి సారించకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు.

Also read : Heavy Rains in Telangana : తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Also read : Revanth Reddy: ఢిల్లీలో టీకాంగ్రెస్ పంచాయితీ.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్! త్వరలో సిరిసిల్లకు రాహుల్ గాంధీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News