TRS to BRS: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు, జండా మారుతాయా ?

TRS to BRS Party Name Change: టీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి బీ.ఆర్.ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి తెలియజేస్తూ టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఉన్నతాధికారులను కలిశారు.

Written by - Pavan | Last Updated : Oct 7, 2022, 01:18 AM IST
TRS to BRS: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు, జండా మారుతాయా ?

TRS to BRS Party Name Change: కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసిన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మార్పు అంశంపై పలు వివరాలు వెల్లడించారు. పార్టీ మార్పు అంశంపై పార్టీ చేసిన తీర్మానం కాపీలు, సంబంధిత ధృవీకరణ పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మార్పు అంశాలు, పలు సందేహాలపై బోయినపల్లి వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారు, పార్టీ జెండా రంగు అయిన గులాబీ బీఆర్ఎస్ పార్టీకి సైతం యధాతధంగా ఉంటాయని వినోద్ కుమార్ తెలిపారు. పార్టీ పేరు మార్పు కోసం కొత్తగా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని.. గతంలోనే టీఆర్ఎస్ గుర్తింపు పొందిన పార్టీ కనుక తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం కేవలం పార్టీ పేరు మాత్రమే మార్చుకున్నాం అని అన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యాక్టులోని సెక్షన్ 29 A సబ్-క్లాజ్ 9 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే పార్టీ మార్పు జరిగిందని గుర్తుచేశారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు స్వరాష్ట్రంలో అభివృద్ధి కూడా సాధించింది అని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎలాగైతే రాష్ట్రంలో అభివృద్ధిని సాధించుకున్నామో.. అదే లక్ష్యంతో దేశంలోనూ అభివృద్ధి పరుగులు పెట్టించాలనే సంకల్పంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు.

Trending News