KTR COMMENTS : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ హడావుడి ఓ రేంజ్ లో ఉంది. విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేశారు. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మరో ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రచ్చబండతో జనంలోకి వెళుతున్నారు హస్తం లీడర్లు. విపక్షాలకు ధీటుగా అధికార టీఆర్ఎస్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతోంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటికి రాకపోయినా.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాలు చుట్టేస్తున్నారు. ఇతర మంత్రులు కూడా తమ ఏరియాల్లో జోరుగా తిరుగుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతోనే అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయనే చర్చ ఉంది. 2018 తరహాలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని విపక్షాలు గట్టిగా నమ్ముతున్నాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారంపై పలు సార్లు స్పందించిన కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెప్పారు. కాని పీకే టీమ్ తో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తున్నారు. సర్వేలో వీక్ ఉన్న నేతలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో విపక్షాలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు లేవని చెబుతున్నారనే వాదన కూడా ఉంది. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్.. జిల్లా టీఆర్ఎస్ నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. అందరు కలిసి పనిచేయాలని సూచించిన కేటీఆర్.. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని.. అందరూ సిద్దంగా ఉండాలని చెప్పారు. కేటీఆర్ తాజా కామెంట్లతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ముందస్తు ఆలోచన ఉంది కాబట్టే... పార్టీ నేతలతో కేటీఆర్ అలా చెప్పారని అంటున్నారు.
ముందస్తు ఎన్నికల సంకేతం ఇవ్వడంతో పాటు పార్టీ నేతలకు మరో కీలక విషయం చెప్పారు కేటీఆర్. ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. గతంలో సిట్టింగులందరికి మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాని ఖమ్మం నేతల సమావేశంలో మాత్రం కేటీఆర్ అందుకు భిన్నమైన ప్రకటన చేశారు. సిట్టింగులకు టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదన్నారు. పని తీరు బాగుంటేనే.. పీకే సర్వేలో సానుకూలంగా ఉంటేనే మళ్లీ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ముఖం చూసి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేతలందరూ సిద్ధంగా ఉండాలని అలర్ట్ చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని.. టికెట్ రానివాళ్లను మరోవిధంగా గౌరవిస్తామని చెప్పారు. నేతలంతా వర్గవిభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
ఖమ్మం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చగా మారాయి. ముందస్తు ఎన్నికలు ఖాయమనే సంకేతం కేటీఆర్ ఇచ్చారని అంటున్నారు. ఏడాది చివరలో అసెంబ్లీని రద్దు చేసి.. మార్చి, ఏప్రిల్ లో జరిగే కర్ణాటక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read also: SBI Recruitmet 2022: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే లాస్ట్ డే..
Read also: Fourth Wave Alert: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు, తగ్గిన మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి