హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదలైంది. 'కీ'ని www.tsprrecruitment.in అనే వెబ్సైట్లో ఉంచినట్టు పంచాయత్ రాజ్ శాఖ ప్రకటించింది. దానితో పాటు ప్రశ్నాపత్రాన్ని కూడా పొందుపరిచినట్టు తెలిపింది. 'కీ' పట్ల అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20 తేదీలోపు ఆన్లైన్లో తెలియజేయాలని చెప్పింది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు అక్టోబర్ 10, 2018న రాతపరీక్ష జరిగింది. పరీక్ష కోసం మొత్తం 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1288 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు.
గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల; తొలగింపు..!
గ్రూప్-4 రాత పరీక్ష పిల్రిమినరీ ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరిచినట్లు మంగళవారం టీఎస్పీఎస్సీ వెల్లడించింది. 'కీ' పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20 నుంచి 26 వరకు ఆన్లైన్ ద్వారా తెలియజేయాలని సెక్రటరీ వాణీప్రసాద్ తెలిపారు. అయితే బుధవారం ఆ 'కీ'ని తొలగించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. కొన్ని ప్రశ్నలకు 'కీ' లో ఇచ్చిన జవాబులు సరిపోలని కారణంగా 'కీ' ని తొలగించినట్లు అధికారులు చెప్పారని స్థానికంగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మళ్లీ 'కీ'ని సరిచేసి విడుదల చేయనున్నారు. 1,595 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 4.49 లక్షల మంది హాజరయ్యారు.