చర్చలు విఫలం.. ఆర్టీసీ, సర్కార్ వైఖరిపై అశ్వత్థామ రెడ్డి తీవ్ర అసంతృప్తి

చర్చలు విఫలం.. ఆర్టీసీ, సర్కార్ వైఖరిపై అశ్వత్థామ రెడ్డి తీవ్ర అసంతృప్తి

Last Updated : Oct 27, 2019, 06:16 AM IST
చర్చలు విఫలం.. ఆర్టీసీ, సర్కార్ వైఖరిపై అశ్వత్థామ రెడ్డి తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లను అన్నింటినీ పరిష్కరించాలని జేఏసి నేతలు కోరగా.. అందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. ఫలితంగా చర్చలు అర్ధాంతరంగానే ముగిశాయి. చర్చలు ముగిసిన అనంతరం ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ఆర్టీసీ యాజమాన్యం తమతో చర్చలు జరిపిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇన్నేళ్ల ఆర్టీసీ చరిత్రలో ఇంత దారుణంగా  నిర్భంధంగా ఎప్పుడూ చర్చలు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కొన్నింటిని మినహాయించాలని కోర్టు చెప్పనేలేదని.. కానీ చర్చల విషయంలో హైకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ 21 డిమాండ్లపై మాత్రమే యాజమాన్యం చర్చిస్తామంటోందని అన్నారు. చిన్న చిన్న డిమాండ్లను కూడా పరిష్కరించలేకపోతున్నారని, ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. 
 
మరో జేఏసీ నేత వీఎస్‌ రావు మాట్లాడుతూ.. కేవలం కోర్టు పిలిచింది కనుకే తమ తప్పు లేదన్నట్టుగా నామమాత్రపు పిలుపు పిలిచారు కానీ ప్రభుత్వానికి అసలు సమస్యను పరిష్కరించే ఉద్దేశమే లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు పిలిచిన యాజమాన్యం.. సహచర నేతలతో కనీసం ఫోన్‌ ద్వారానైనా చర్చించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని మరో నేత వాసుదేవ రావు చెప్పారు. మరో నేత రాజిరెడ్డి మాట్లాడుతూ.. చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఆర్టీసీ సమ్మెను కొనసాగించేందుకే జేఏసి నేతలు మొగ్గుచూపుతున్నట్టు వారి మాటలు స్పష్టంచేస్తున్నాయి.

Trending News