హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం జరుగుతున్న ప్రచారం రోజుకింత రాజకీయ వేడిని రాజేస్తోంది. సోమవారం రాత్రి స్థానికంగా జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''700 మంది కాదు కదా, 7000 మంది టీఆర్ఎస్ శ్రేణులు కలిసొచ్చినా పద్మావతి రెడ్డి విజయాన్ని అడ్డుకోలేరు'' అని అన్నారు. అంతేకాదు.. 'పద్మావతి రెడ్డిని 30,000 మెజార్టీతో గెలిపించుకోకపోతే.. తాను ఏ శిక్షకైనా సిద్ధమే' అని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
హుజూర్‌నగర్ సభా వేదికపై నుంచే మంత్రి కేటీఆర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'ఎన్‌ఆర్‌ఐగా వచ్చి నీ తండ్రిని చూసుకుని ఏదేదో మాట్లాడుతున్నావు కానీ నేను 16 ఏళ్ల వయసులోనే దేశ రక్షణ కోసం కృషి చేశాను' అని అన్నారు. గతంలోనే తాను ఎన్నో అభివృద్ధి పనులు చేపడితే ఇప్పుడొచ్చిన ఈ టీఆర్‌ఎస్ దద్దమ్మలు.. ఉత్తమ్ ఏం చేశాడంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇదే వేదికపై నుంచి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మావతిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయాలని అన్నారు. అవినీతిపరుడు కేసీఆర్, బచ్చా కేటీఆర్‌కు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ ఇది అంటూ ఎంపీ కోమటిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.