హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేత సంపత్ వెళ్తే తప్పేంటని ప్రశ్నించిన వీహెచ్.. యురేనియంలో సంపత్‌కి ఏబీసీడీలు తెలియవని వ్యాఖ్యానించి ఆయన్ని అవమానించారని అన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అని చెబుతూ ఆయనకు స్పీడ్ ఎక్కువుందని.. అది తగ్గించుకుంటే బాగుంటుందని హితవు పలికారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడిన వీహెచ్.. రేవంత్ స్టయిల్ ప్రాంతీయ పార్టీల్లో నడుస్తుంది కానీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో కాదని అన్నారు. హుజూర్‌నగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్న వీహెచ్.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో నల్గొండ నేతలంతా ఏకమయ్యారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారనే విషయాన్ని వీహెచ్ గుర్తుచేశారు.