KCR DELHI TOUR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. మూడు రోజుల క్రితం హస్తిన వెళ్లిన ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. సమావేశాలు నిర్వహించినట్లు సమచారం లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారని వార్తలు వచ్చినా... ఆయన రాష్ట్రపతి భవన్ కు వెళ్లలేదు. జాతీయ రాజకీయాల్లో భాగంగా వివిధ పార్టీల నేతలతో మాట్లాడుతురాని టీఆర్ఎస్ వర్గాలు లీకులు ఇచ్చినా అలాంటి మీటింగ్స్ కూడా జరగడం లేదు. ఓవైపు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్ ను వరదలు వణికించాయి. జంట జలాశయాలకు ఊహించని వరద రావడంతో మూసీ ఉప్పొంగింది. మూసీ పరివాహాక ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో గడిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాలుకు గాయం కావడంతో ప్రగతిభవన్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
వరద పరిస్థితులను పర్యవేక్షించాలని కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. జాతీయ రాజకీయాలు కాకుండా తెలంగాణ రాజకీయ పరిస్థితులపైనే హస్తినలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో ఆయన చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వివిధ సర్వేల ఆధారంగా పీకే టీమ్ కేసీఆర్ తుది నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. ఆ సర్వే ఫలితాలతో పీకీతో కేసీఆర్ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. పార్టీ పరిస్థితి ఏంటీ ,ముందస్తు ఎన్నికలు , ముందస్తుకు పోతే ఎప్పుడు వెళ్లాలి... అసెంబ్లీ రద్దు ఎప్పుడు చేయాలి అన్న అంశాలపై కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థులకు సంబంధించిన పూర్తి విషయాలపై ఆగస్టులోగా పీకే టీమ్ మరో నివేదికను కేసీఆర్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని.. ఇంకా పెరుగుతుందని... ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిందేనని పీకే టీమ్ నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో ముందస్తుకు వెళ్లాలని డిసైడ్ అయిన కేసీఆర్... అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. 2023 డిసెంబర్ వరకు ప్రస్తుత అసెంబ్లీకి గడువుంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత 6 నెలల్లోపు తిరిగి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు ఉంటే వాటితో కలిపి నిర్వహిస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.2023 ఏప్రిల్, మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. గుజరాత్ తో పాటు ఎన్నికలు జరగాలంటే ఆగస్టులోపు అసెంబ్లీని రద్దు చేయాలి. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే కర్ణాటకతో పాటు ఎన్నికలు జరుగుతాయి.
కర్టాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే బీజేపీకి ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దక్షిణాసియాలో బీజేపీ అధికారంలో ఉన్నది ఒక్క కర్ణాటకలోనే. అందుకే అక్కడ పవర్ నిలుపుకోవడం కమలనాధులకు అత్యంత కీలకం. దీంతో కర్ణాటకపై బీజేపీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్న కేసీఆర్.. కర్ణాటకతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కర్ణాటకతో పాటు ఎన్నికలు జరిగితే బీజేపీ హైకమాండ్ పూర్తిస్థాయి ఫోకస్ తెలంగాణపై పెట్టలేదన్నది కేసీఆర్ లెక్క. దీంతో నవంబర్, డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని.. పీకే టీమ్ కూడా ఇదే సూచించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఈ అన్ని అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు సాగిస్తున్నారని చెబుతున్నారు.
Also Read: అబ్బాయి 7 అడుగులు, అమ్మాయి 5 అడుగులు.. పూలదండ వేసేందుకు వధువు పడిన కష్టాలు చూడండి!
Also Read: ఏడాదిలోనే బ్రేకప్ చెప్పేసిన హీరోయిన్.. మూన్నాళ్ల ముచ్చటే అయిందిగా!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook