పేలిన ఫ్యూగో అగ్నిపర్వతం.. ఆరుగురు మృతి

ఆదివారం మధ్య అమెరికా దేశమైన గ్వాటెమలలోని ఫ్యూగో అగ్ని పర్వతం బద్దలైంది.

Last Updated : Jun 4, 2018, 11:52 AM IST
పేలిన ఫ్యూగో అగ్నిపర్వతం.. ఆరుగురు మృతి

ఆదివారం మధ్య అమెరికా దేశమైన గ్వాటెమలలోని ఫ్యూగో అగ్ని పర్వతం బద్దలైంది. దీంతో 6 మంది మృత్యువాత పడగా.. 20 మంది గాయపడ్డారని.. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్వాటెమలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూగో అగ్ని పర్వతం పేలడంతో ఆకాశంలో దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయని.. ఇవి గ్వాటెమలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు విస్తరించాయని స్థానిక ఛానళ్ళు తెలిపాయి.

 

దీని కారణంగా, గ్వాటెమాల నగరంలోని లా అరోరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ను మూసివేశారు. అగ్నిపర్వతం దగ్గర నివసిస్తున్న అనేక మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఫ్యూగో అగ్నిపర్వతం యొక్క లావా దగ్గరలో ఉన్న గ్రామాన్ని బూడిద చేసేసింది. ఈ కారణం చేత మృతుల సంఖ్య భారీ సంఖ్యలో ఉండవచ్చని తెలిసింది. గ్వాటిమాల ప్రభుత్వం బాధిత ప్రాంతాలలోని ప్రజలు విషపూరిత పొగ, బూడిదను పీల్చుకోకుండా ముసుగులు ధరించాలని ప్రజలకు సలహా ఇచ్చింది.

ఈ అగ్ని పర్వతం మరికొన్ని రోజులు ఇలాగే లావాను వెదజల్లుతుందని అధికారులు పేర్కొనడంతో గ్వాటిమాలా అధ్యక్షుడు జిమ్మీ మోరల్స్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గ్వాటెమలకు అన్ని రకాలుగా సాయం అందించడానికి మెక్సికోతో పాటు మరికొన్ని ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.

Trending News