ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లో మరోమారు ముష్కరులు దాడులకు తెగబడ్డారు. పాలిటెక్నిక్ యునివర్సిటీ సమీపంలో మతాధికారులు సమావేశమై, తిరిగి వెళ్లేటప్పుడు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని స్థానిక వార్తా ఛానళ్ళు తెలిపాయి.
సంఘటన జరిగిన సమయంలో 2,000 మత పండితులు/గురువుల బృందం ఆఘనిస్థాన్‌లో జరుగుతున్న యుద్ధంలో ఆత్మాహుతి దాడులకు వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేయడానికి విశ్వవిద్యాలయంలో గుమిగూడారని స్పుత్నిక్ వార్తా సంస్థ పేర్కొంది.
భద్రతా అధికారుల సమాచారం ప్రకారం, పాలిటెక్నిక్ యునివర్సిటీ సమీపంలో టెంట్ వేసుకొని కొందరు ముస్లిం మతాచార్యులు తీవ్రవాదాన్ని నిందిస్తున్న సమయంలో ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మంది మత పండితులు, నలుగురు భద్రతా సిబ్బందితో సహా కనీసం 14 మంది చనిపోయారని, 17 మంది గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరో ముగ్గురు మృతి చెందారని.. వారిని ఇంకా గుర్తించలేదని నివేదికలు తెలిపాయి. 'మాకు తెలిసిన సమాచారం ప్రకారం, అతిథులు సమావేశం జరిగే టెంట్‌ను వదిలి వెళ్లేటప్పుడు ఈ దుర్ఘటన జరిగింది" అని పోలీసు అధికార ప్రతినిధి హష్మత్ అన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరూ(ఏ తీవ్రవాద సంస్థ) దాడికి బాధ్యత వహించలేదు.