అక్కడ సెలవు తీసుకోకుండా పనిచేస్తే భారీ జరిమానా

ఎక్కడైనా సెలవు కూడా తీసుకోకుండా పని చేస్తే వాళ్లను అందలం ఎక్కిస్తాయి కంపెనీలు.

Last Updated : Mar 19, 2018, 02:17 PM IST
అక్కడ సెలవు తీసుకోకుండా పనిచేస్తే భారీ జరిమానా

ఎక్కడైనా సెలవు కూడా తీసుకోకుండా పని చేస్తే వాళ్లను అందలం ఎక్కిస్తాయి కంపెనీలు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. సెలవు తీసుకోకుండా కష్టపడి పని చేసినందుకు ఓ వ్యక్తికి 3600 డాలర్ల ఫైన్ (2.4 లక్షలు) వేశారు. విడ్డూరంగా ఉంది కదూ..!

వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ లో కంపెనీ అయినా, సొంత బిజినెస్ అయినా స్థానిక కార్మిక చట్టం ప్రకారం.. వారానికి ఆరు రోజులే పని చేయాలి. అలా కాదని సెలవు రోజునా పనిచేస్తే.. ఈ వ్యక్తికి పట్టిన గతే పడుతుంది. కెడ్రిక్ వైవ్రే అనే వ్యక్తి ప్యారిస్‌కు 120 మైల్స్ దూరంలో ఉన్న లుసిగ్నీ సుర్ బార్సె అనే పర్యాటక ప్రదేశంలో బేకరీని నిర్వహిస్తున్నాడు. వేసవి సమీపిస్తుండటంతో ఈ కాలంలో అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందట. దీంతో బేకరీ ఐటెమ్స్‌కు గిరాకీ బాగా ఉంటుంది. అందుకే.. పగలు, రాత్రి తేడాలేకుండా సెలవు తీసుకోకుండా మరీ పని చేశాడు. ఈ విషయం కాస్త లేబర్ అధికారులకు తెలియడంతో.. సెలవు తీసుకోకుండా పని చేసినందుకు 3600 డాలర్ల జరిమానా వేశారు.

ఇలాంటి నియమాల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని.. వారానికి ఏడు రోజులూ పనిచేసుకొనేలా వెసులుబాటు కల్పించాలని కొంత మంది వ్యాపారస్థులు అక్కడి ప్రభుత్వంపై పిటిషన్ వేశారట. మరి వాళ్లకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తారో? లేదో? వేచి చూడాలి.

Trending News