ఈ ఏడాది 7.3శాతం వృద్ధి రేటు: ఐఎంఎఫ్ అంచనా

ఈ ఏడాది 7.3శాతం వృద్ధి రేటు: ఐఎంఎఫ్ అంచనా

Last Updated : Oct 9, 2018, 11:33 AM IST
ఈ ఏడాది 7.3శాతం వృద్ధి రేటు: ఐఎంఎఫ్ అంచనా

భారత్‌ వృద్ధిరేటుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018లో భారత్ వృద్ధిరేటు 7.3 శాతంగా, 2019లో 7.4 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2017లో భారతదేశం 6.7 శాతం వృద్ధి రేటును సాధించింది.

'2018లో భారత్ వృద్ధిరేటు 7.3 శాతం, 2019లో 7.4 శాతం ఉంటుందని అంచనా. ఇది 2017లో భారత వృద్ధి రేటు 6.7 శాతం కంటే ఎక్కువ. ' అని తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ రిపోర్టులో ఐఎంఎఫ్ పేర్కొంది.

బాలీలో జరిగిన ఐఎంఎఫ్ వార్షిక సమావేశానికి ముందు వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (WEO) విడుదల చేసింది. "భారతదేశంలో ఇటీవలి కాలంలో అనేక సంస్కరణలు విజయవంతంగా అమలు చేయబడ్డాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ద్రవ్యోల్బణ లక్ష్య ప్రణాళిక సహా విదేశీ పెట్టుబడులను సరళీకరించడానికి చర్యలు తీసుకోవడం, వ్యాపారాన్ని సులభతరం చేయడం లాంటివి అందులో కొన్ని..' అని ఐఎంఎఫ్ పేర్కొంది.

మరోవైపు భారత్ జీడీపీ వేగం పుంజుకుంటున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో వృద్ధిరేటు 7.3 శాతంగా, వచ్చే రెండేళ్లలో 7.5 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ ఆదివారం పేర్కొంది.

ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా భారత్ అవతరించిందని.. సామాజిక, ఆర్థిక రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల ఫలితంగా వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతున్నదని ప్రధాని మోదీ ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల సదస్సు 2018లో అన్నారు. దేశంలో ద్రవ్యలోటు తగ్గుముఖం పట్టిందన్న ఆయన.. భారత్‌లో పెట్టుబడులకు స్వర్గధామమని, దేశంలో అమలవుతున్న సులభ వాణిజ్య విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

Trending News