న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మరోసారి భారత్‌లో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నుతోందని భారత నిఘావర్గాలు కేంద్ర హోంశాఖను హెచ్చరించాయి. పాకిస్తాన్ కి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలీజెన్స్ (ఐఎస్ఐ) జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతోపాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతోందని భారత నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు ఓ నివేదిక అందించాయి. భారత్ లో దాడులకు పాల్పడాలనే లక్ష్యంతో పాక్ ఐఎస్ఐ ఆఫ్ఘనిస్తాన్ లో జైషే మహ్మద్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో రహస్యంగా సమావేశమైనట్టు భారత నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు అందించిన నివేదికలో పేర్కొన్నాయి.
నిఘావర్గాలు అందించిన నివేదికపై కేంద్ర హోంశాఖకు చెందిన అధికారవర్గాలు స్పందిస్తూ ఆఫ్గనిస్తాన్ లో నాటో దళాలకు వ్యతిరేకంగా జైషే మహ్మద్, తాలిబాన్ ఉగ్రవాద సంస్థలు దాడులు చేస్తున్నాయని, అక్కడి పరిణామాలపై తాము ఎప్పటికప్పుడు ఓ కన్నేసి పెడుతున్నామని అన్నారు. అంతేకాకుండా జైషే మహ్మద్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇకపై కలిసి పనిచేసేందుకు ఓ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే పాక్ ఐఎస్ఐ భారత్ పై దాడులకు జైషే మహ్మద్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నుతున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి.