కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించవచ్చు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించి కాశ్మీర్ ఓ ప్రధాన సమస్యని.. అయితే దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు

Last Updated : Jul 27, 2018, 03:57 PM IST
కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించవచ్చు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించి కాశ్మీర్ ఓ ప్రధాన సమస్యని.. అయితే దానిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇటీవలే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. "కాశ్మీరీలు ఎన్నో సంవత్సరాల నుండి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి మానవ హక్కులను హరించడం అనేది అక్కడ జరుగుతోంది.

అయితే భారత్ ఒప్పుకుంటే చర్చల ద్వారా ఈ సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉంది. ఉప ఖండానికి కూడా ఇది మంచి పరిణామం" అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. "భారత్ ఒక అడుగు వేస్తే.. మేము రెండు అడుగులు వేస్తాం. ప్రస్తుతం భారత్ మమ్మల్ని తప్పు పట్టే విధంగా ప్రవర్తిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం రోజులుగా భారతదేశానికి చెందిన మీడియా సంస్థలు తనను విలన్‌గా చిత్రీకరించాయని తెలిపారు. కానీ, తాను క్రికెట్ ఆడడానికి ఇండియాకి వెళ్లిన ఓ పాకిస్తానీనని కూడా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. 

"మేము భారతదేశంతో ఉండే మా బంధాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాం. కానీ మా బెలుచిస్తాన్ వంటి ప్రాంతాలపై భారత్ ప్రభావం పడుతోంది" అని ఇమ్రాన్ అన్నారు. "మేము చైనాతో కూడా మా బంధాలను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. సీపీఈసీ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) విజయవంతమవ్వాలని కూడా కోరుతున్నాం. పేదరిక నిర్మూలన వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీలైతే చైనా వెళ్లి పలు పద్ధతులు తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నాం.

అలాగే ఈ రోజు మనం చైనాని చూసి అవినీతికి కూడా ఎలా అడ్డుకట్ట వేయాలో నేర్చుకోవాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పై కూడా ఇమ్రాన్ ఖాన్ కామెంట్ చేశారు. ఆ దేశం ఎప్పుడూ యుద్ధాలతో సతమతమవుతూ ఉంటుందని.. అక్కడ శాంతి, సామరస్యం పెరగాలని తాను భావిస్తున్నానని తెలిపారు. 

Trending News