బద్ధ శత్రువులైన ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు కలిసిపోయాయి. శుక్రవారం ఇరు దేశాల మధ్య సామరస్యం వెల్లివిరిసింది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ లో శీతాకాల ఒలింపిక్ వేడుకల ప్రారంభోత్సవ వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉభయ కొరియా దేశాల క్రీడాకారుల బృందాలు కలిసి ఒకే జెండా కింద పరేడ్‌లో పాల్గొన్నాయి.
అథ్లెట్ల పరేడ్ జరుగుతున్నప్పుడు, వీఐపీలు కూర్చొనే ప్రాంతంలోకి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చెల్లెలు కిమ్ యో జోంగ్లు కరచాలనం చేసుకొని చిరునవ్వులు చిందించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధం చిగురిస్తున్నట్లు స్థానిక వార్తా ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి.
ఎన్ని విభేదాలున్నా శాంతి, సామరస్యంతో కలిసి మెలిసి జీవించేలా ఉభయ కొరియాలు స్పూర్తినిస్తున్నాయని ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. కొరియా యుద్ధం అనంతరం.. ఉత్తర కొరియా రాజ వంశం తరఫున దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తొలి వ్యక్తి యో జోంగ్ కావడం గమనార్హం.