యూజర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీ కంపెనీలకు అందించారని అభియోగాలు ఎదుర్కొంటున్న క్రమంలో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం మీడియాతో తన ఆలోచనలు పంచుకున్నారు. పొరపాటు జరిగిందని తమ సంస్థ భావిస్తుందని.. .. అందుకు చాలా చింతిస్తున్నామని.. తమ తప్పును సరిదిద్దుకొనేందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఆయన తన యూజర్లను ఈ సందర్భంగా కోరారు.
కేంబ్రిడ్జ్ అనాల్టికా అనే కంపెనీకి ఫేస్‌బుక్ యాజమాన్యం యూజర్ల సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఫేస్‌బుక్ పై విరుచుకుపడ్డారు. పలువురు సెలబ్రిటీలు ఫేస్‌బుక్ నుండి వైదొలిగారు కూడా. ఈ క్రమంలో స్వయానా సీఈఓయే మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగిందని.. ఒక అవకాశం ఇవ్వమని యూజర్లను కోరడం గమనార్హం
జరిగిన పొరపాట్లు అన్నింటికి ఫేస్‌బుక్ తరఫున తానే బాధ్యత వహిస్తున్నానని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇప్పటికే ఫేస్‌బుక్ యాజమాన్య బోర్డు, తప్పుకు బాధ్యతలు వహిస్తూ సీఈఓ పదవి నుండి జుకర్‌బర్గ్ వైదొలగాలని చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను జుకర్‌బర్గ్ ఖండించారు. తన వరకూ ఆ సమాచారం ఏమీ రాలేదని ఆయన చెప్పారు.
అలాగే ఈ జరిగిన పొరపాట్లను ఆధారంగా చేసుకొని ఫేస్‌బుక్ తమ ఉద్యోగులు ఎవరినీ కూడా సంస్థ నుండి తొలిగించదని కూడా ఆయన అన్నారు. "అన్నింటికీ నాదే బాధ్యత" అని ఆయన అన్నారు. అలాగే ఇప్పుడు ఫేస్‌బుక్ సాంకేతికంగా వస్తున్న ఇలాంటి కొత్త సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలంటే.. మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై కూడా జుకర్‌బర్గ్ స్పందించారు. తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారం ఇన్ని రోజుల్లో లభిస్తుందని చెప్పలేమని ఆయన పేర్కొన్నారు