ప్రమాణ స్వీకారం చేసిన ప్రపంచ వృద్ధ నేత

మలేషియా ప్రధానిగా మహతిర్ ప్రమాణస్వీకారం చేశారు.

Last Updated : May 12, 2018, 10:06 AM IST
ప్రమాణ స్వీకారం చేసిన ప్రపంచ వృద్ధ నేత

మలేషియా దేశానికి ఏడవ ప్రధానిగా ప్రధానిగా మహతిర్ మహ్మద్ (92) ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ప్రపంచంలోనే అతి వృద్ధ నేతగా మహతిర్ రికార్డు సాధించారు. పార్లమెంట్‌లోని దిగువ సభలో 222 సీట్లకు గానూ మహతిర్‌ సంకీర్ణం పకటన్ హరపన్ 113 సీట్లను గెలుచుకుంది. 60సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన బరిసన జాతీయ సంకీర్ణ కూటమిని ఓడించింది. మలేసియా రాజు సుల్తాన్‌ మహ్మద్‌-5 తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మహతిర్‌ను ఆహ్వానించారు.

గతంలో బీఎన్‌ కూటమిలో ఉన్న మహితిర్‌.. 1981 నుంచి 2003 వరకు 22 ఏళ్లపాటు ప్రధానిగా చేశారు. 2016లో బీఎన్ కూటమి నుంచి బయటకొచ్చి.. పకటన్ హరపన్‌లో చేరారు. వాస్తవానికి రాజకీయాల నుంచి రిటైర్‌ అయిన మహతిర్‌.. తన మాజీ శిష్యుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని నజీబ్ రజాక్‌పై ఈసారి పోటీ చేసి.. విజయం సాధించారు.

కౌలాలంపూర్‌లోని నేషనల్ ప్యాలెస్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన భార్య, డిప్యూటీ ప్రధాని వాన్ అజిజా వాన్ ఇస్మాయిల్, సంకీర్ణ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని మహతిర్ మహ్మద్ హామీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తానని మహతిర్‌ తెలిపారు.

Trending News