మయన్మార్‌లో రోహింగ్యాల సమస్యకి కారణం ఆ దేశ మిలట్రీయేనని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్ తెలిపారు. అయితే ఈ విషయంలో మయన్మార్‌పై అమెరికా వైఖరి ఏమిటన్న విషయం మీద తను ఏమీ మాట్లాడలేదు. వాష్టింగ్టన్స్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఏ ప్రాంతంలోనైనా దౌర్జన్యాలు, దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు ప్రపంచం చూస్తూ ఊరుకోదు" అన్నారు.
ఇప్పటికే 5,82,000 రోహింగ్యాలు మయన్మార్ విడిచి బంగ్లాదేశ్ చేరుకున్నారని, కొత్తగా 10,000 నుండి 15,000 మంది వచ్చి చేరారని తెలిపారు. ఇదివరకు కూడా అమెరికా రోహింగ్యాల విషయంలో అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. రాకినే స్టేట్‌లో రక్తం ఏరులై పారడంపై ఆ దేశ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని కూడా అభిప్రాయపడింది. టెల్లిర్‌సన్ ఈ విషయంపై మాట్లాడుతూ "మయన్మార్ భవిష్యత్తుపై తమ పాత్ర ఏమిటో తెలుసుకొని, ఆ దిశగా తాము ఎలాంటి మార్గంలో పయనించాలన్నది ఆ దేశమే నిర్ణయించుకోవాలి" అని తెలిపారు.