పుతిన్ మాకు శత్రువు కాదు: డొనాల్డ్ ట్రంప్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకి శత్రువు కాదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 

Updated: Jul 12, 2018, 07:08 PM IST
పుతిన్ మాకు శత్రువు కాదు: డొనాల్డ్ ట్రంప్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకి శత్రువు కాదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వచ్చే వారం ఆయన పుతిన్‌ను కలవబోతున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రష్యా వల్ల అమెరికాకి భవిష్యత్తులో ముప్పు ఉంటుందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకి ట్రంప్ సమాధానమిచ్చారు. అలాంటిదేమీ ఉంటుందని తాను అనుకోవడం లేదని.. అందుకే అమెరికాకి "నాటో"  ఉందని ట్రంప్ అన్నారు.

"నాకైతే పుతిన్ ఎలాంటి వారో వ్యక్తిగతంగా తెలియదు. ఆయన నాకు శత్రువని మీరు భావిస్తున్నారా..? అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఆయన నాకు మిత్రుడిగా కూడా మారవచ్చు కదా" అని ట్రంప్ విలేఖరుల సమావేశంలో ఛలోక్తులు విసిరారు. కొత్త ఒప్పందాల గురించి... ఐఎన్‌ఎఫ్ ఒప్పందం ఉల్లంఘనకు సంబంధించి రష్యా వైఖరి గురించి చర్చల్లో మాట్లాడనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు. 

"పుతిన్‌తో జరిగే సమావేశంలో లోతుగా చర్చిస్తామని చెప్పలేను. అయితే సిరియా సమస్య గురించి, ఉక్రెయిన్‌కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది" అని ట్రంప్ తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సిరియాలో రసాయన దాడికి ప్రతిచర్యగా ఆ దేశంలో అమెరికా వైమానికి దాడులకు దిగితే.. అది అమెరికా, రష్యాల మధ్య యుద్ధానికి దారితీయగలదని పుతిన్ తెలిపారు.