ఇంటి అద్దెకే భారీ మొత్తంలో జేబుకు చిల్లు పెట్టుకుంటున్నామే అని దిగాలు పడుతున్నారా ? అయితే మీరు హాంగ్ కాంగ్‌లోని కౌలూన్ జిల్లాలో వుండాల్సి రానందుకు సంతోషించండి అంటున్నారు అక్కడ కార్ల పార్కింగ్‌కే వేల మొత్తంలో సమర్పించుకుంటున్న వాళ్లు. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇళ్లు, కార్యాలయాలకు అత్యధిక మొత్తంలో అద్దె వసూలు చేసే ప్రాంతాల్లో హాంక్ కాంగ్ ఒకటి. ఇటీవలే ఇక్కడ ఓ కార్ పార్కింగ్ స్పేస్ కోసం వసూలు చేసిన అద్దె మొత్తం మీడియాలో పతాక శీర్షికలకెక్కింది. అందుకు కారణం కేవలం 135 చదరపు అడుగుల పార్కింగ్ స్థలానికి 10,000 హాంగ్ కాంగ్ డాలర్ల అద్దె వసూలు చేయడమే. అమెరికా డాలర్లలో ఈ మొత్తం 1,274 డాలర్లు కాగా భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.85,000లతో సమానం. ఈ అద్దె మొత్తాన్ని కేవలం భారతీయ కరెన్సీలోనే కాకుండా హాంగ్ కాంగ్ కరెన్సీలోనూ అధిక మొత్తంగానే భావించాల్సి వుంటుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది. కేవలం డిమాండ్, సప్లై మధ్య భారీ వ్యత్యాసం వుండటమే ఈ అధిక ధరలకు కారణం అని ఆ పత్రిక కథనం అభిప్రాయపడింది.
అధికమొత్తంలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న భవనాల్లో చాలామంది యజమానులకు వాహనాల పార్కింగ్ స్థలం లేకపోవడం ఈ డిమాండ్‌కి ఓ కారణమైతే, అందులోనూ చాలామందికి ఒకటికి మించి ఎక్కువ వాహనాలు కలిగి వుండటం మరో కారణం. సాధారణంగానే హాంగ్ కాంగ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో భవనాల ధరలు, అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికితోడు వాహనాల పార్కింగ్ విషయంలో డిమాండ్‌కి తగిన విధంగా స్థలం అందుబాటులో లేకపోవడం వల్లే పార్కింగ్ స్థలాల అద్దెలు సైతం అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి.
హాంగ్ కాంగ్‌లో అంతోఇంతో స్థలం వున్న స్థానికులు చాలామంది ఇప్పుడు వాహనాల పార్కింగ్ వ్యాపారంపై కన్నేశారంటే అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కారు పార్కింగ్‌కు అద్దె నెలకు రూ.85,000