మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నాలుగోసారి ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. 74 శాతం ఓట్లను పుతిన్ సాధించనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ లో వెల్లడైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు ఆదివారం ప్రజలు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం 2 గంటలకే దాదాపు 52 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పుతిన్‌తోపాటు మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో దిగారు. చట్టపరమైన సమస్యలతో ప్రధాన పోటీదారు అలెక్సీ నావలెన్యీని పోటీకి అనర్హులని ప్రకటించారు.
దీంతో పుతిన్ ఎన్నిక మరోసారి లాంఛనమేనని తేలిపోయింది. దాదాపు 19 ఏళ్ల క్రితం ఆయన తొలిసారిగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అధికారంలోనే కొనసాగుతున్నారు. నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు పుతిన్ దక్కించుకోనున్నారు.