లక్షలాది వలసదారులకు షాక్ ఇవ్వనున్న ట్రంప్

                                   

Updated: Oct 30, 2018, 08:58 PM IST
లక్షలాది వలసదారులకు షాక్ ఇవ్వనున్న ట్రంప్

వాషింగ్టన్: వలసదారులకు వ్యతిరేకిగా ముద్రపడ్డ అయెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తన పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాయేతరులకు షాక్ ఇచ్చే మరో నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికాయేతరులకు జన్మించే శిశువులకు జన్మతః వచ్చే పౌరసత్వ హక్కు రద్దుకు ఆదేశాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఇది న్యాయ నిపుణులు సమీక్ష కోసం పంపినట్లు అధికారిక వర్గాల సమచారం. న్యాయ నిపుణుల అభిప్రాయం తర్వాత దీన్ని చట్టం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదే జరిగితే భారత్ తో పాటు ప్రపంచ నలుమూల నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పవునే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వలసదారుల వ్యతిరేక నిర్ణయం వెలవడితే అమెరికాలో నివసిస్తున్న అమెరికాయేతరులు ఉద్యమ బాట పట్టే అవకాశముందే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

రాజకీయ లబ్ది కోసమే ఇది..

ఇప్పటికే ఆయన హెచ్-1బి, గ్రీన్‌ కార్డు, ఇతర వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వలసదారుల పిల్లలకు జన్మతః లభించే హక్కు రద్దు చేస్తే మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చనేది ట్రంప్ ఎత్తుగడ. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నోఏళ్లగా అమెరికాలో స్థిరపడ్డ తమ పట్ల ఉక్కుపాదం మోపడం సరికాదంటూ  పలువురు ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కోర్టులో నిలవదంటున్న న్యాయనిపుణులు

ఒక వేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకంటే న్యాయపోరాటనికి సిద్ధమని పలువురు ఎన్నారైలు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణ ఆ దేశంలో జన్మించే చిన్నారులకు పౌరసత్వ హక్కును లభిస్తుంది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే ట్రంప్.. న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని  అమెరికా చట్టాలు తెలిసిన పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు