పాకిస్తాన్‌కి మళ్లీ ఆయుధాలను పంపిస్తే ఒట్టు: అమెరికా

అమెరికన్ ప్రభుత్వం పాకిస్తాన్ చర్యలపై అభ్యంతరం, విచారంతో పాటు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది.

Last Updated : Jul 15, 2018, 05:24 PM IST
పాకిస్తాన్‌కి మళ్లీ ఆయుధాలను పంపిస్తే ఒట్టు: అమెరికా

అమెరికన్ ప్రభుత్వం పాకిస్తాన్ చర్యలపై అభ్యంతరం, విచారంతో పాటు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. అమెరికన్ కాంగ్రెస్ నేత డానా రొహ్రాబాచర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు ఇక అమెరికా సహకరించేది లేదని.. అక్కడికి ఎలాంటి ఆయుధాలనూ పంపించే సహాయాలు అందవని తెలిపారు. పాకిస్తాన్ తమ వద్ద ఉండే ఆయుధాలు.. తమ ప్రజలపైనే ఉపయోగించే దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆయన అన్నారు.

ఇస్లామాబాద్ ప్రభుత్వం గానీ, ఐఎస్‌ఐ గానీ అక్కడి ప్రజలకు రక్షకులుగా ఉండే బదులు, వాళ్ళను తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే తాము తప్పకుండా ఇలాంటి విషయాలను ఖండిస్తామని రొహ్రాబాచర్ తేల్చి చెప్పారు. గతంలో కూడా అమెరికన్ అంబాసిడర్ నిక్కీ హాలీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెబుతూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ధ్వజం ఎత్తారు. 

శుక్రవారం పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాక.. రొహ్రాబాచర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన దారుణమైన ఘటనలో జాతీయ నాయకుడితో సహా కనీసం 133 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.  జూలై 25న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పాకిస్థాన్‌లో ఎన్నికల ముందు జంట పేలుళ్లు చోటుచేసుకోవడంపై ఐక్యరాజ్యసమితి, ప్రపంచ నాయకులు స్పందించారు. పాకిస్థాన్‌లో రాజకీయ అభ్యర్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు.

పాక్‌లో ఈ నెల 25న ఎన్నికల నేపథ్యంలో బలూచిస్థాన్‌ అవామీ పార్టీ (బీఏపీ) మస్తంగ్‌లో ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బీఏపీ అభ్యర్థి సిరాజ్‌ రైసానీ వాహనం సమీపంలో వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు.ఈ ఘటనలో బీఏపీ అభ్యర్థి సిరాజ్‌ రైసానీ సహా.. 128 మంది మృతి చెందగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించుకుంది.

Trending News