భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య స్నేహం వికసించాలని.. ఆ దేశాల మధ్య సంబంధాలు పటిష్టమవ్వాలని చైనా కోరుకుంటుందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి లూకంగ్ అన్నారు. భారత్, పాకిస్తాన్.. ఈ రెండు దేశాలు బలమైన దేశాలని.. ప్రాంతీయ పరంగా శాంతి, స్థిరత్వాలను పెంపొందించుకోవడానికి ఈ రెండు దేశాలు ప్రయత్నించాలని... ఈ క్రమంలో వీరి బంధాలు పటిష్టమవ్వడం కోసం ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించడానికి చైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని లూకంగ్ తెలిపారు. అయితే చైనా ఒక మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశం ఉందా..? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.
"నేను భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ కూడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకొనే విషయంలో అనుకూలతతో ఉన్నట్లు కనబడుతున్నాయని.. ఈ క్రమంలో చైనా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని అన్నాను. అంతకు మించి మాకు ఏ ఇతర ఉద్దేశం లేదు" అని లూకంగ్ తెలిపారు. గతంలో కూడా లూకంగ్ భారత్, పాకిస్తాన్ చర్చల గురించి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకొనే ఉద్దేశంతోనే ఈ చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తాజాగా భారత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఉత్తరం రాసినట్లు వస్తున్న వార్తలపై కూడా లూకంగ్ స్పందించారు. ఇలాంటివి మంచి పరిణామాలని ఆయన అన్నారు. ఇటీవలే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్‌తో చర్చలకు తాము సిద్ధమే అని తెలిపారు. పలు సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్‌తో మాట్లాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధమే అని ఆయన తెలిపారు.