ఆంధ్రప్రదేశ్లోని నదులను అనుసంధానం చేసి దానికి "మహా సంగమం" అనే పేరును పెడతాననని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మహా సంగమం ద్వారా దాదాపు 40.26 లక్షల ఎకరాల పొలాలకు నీటిని అందివ్వడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన చంద్రబాబు అక్కడ విలేకర్లతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి సాంకేతికపరమైన అనుమతులన్నీ వచ్చాయని.. టెక్నికల్ కమిటీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించడమే తరువాయి అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.16000 కోట్లు ఖర్చుపెట్టిందని ఆయన తెలిపారు.
అలాగే ప్రభుత్వం చేపట్టిన మరో మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అలాగే నదుల అనుసంధానానికి సంబంధించి సీఎం మాట్లాడుతూ, క్రిష్ణా జిల్లా వైకుంఠపురం వద్ద బ్యారేజీని నిర్మిస్తామని అన్నారు.