ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌తోపాటు రాష్ట్ర విభజన బిల్లులోని హామీలని నెరవేర్చాల్సిందిగా కోరుతూ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నారు. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు పుట్టిన రోజు కాగా.. అదే రోజున తాను నిరాహార దీక్షకు కూర్చోనున్నట్టు ఆయన తాజాగా ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం అవలంభిస్తున్న విధానాలని నిరసిస్తూనే తాను ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధపడుతున్నట్ట చంద్రబాబు తన ప్రకటనలో స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు... తమిళనాడు తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ని కూడా విభజించి పాలించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దీక్ష చేపట్టిన సందర్భంలో ప్రధానికి సంఘీభావం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు ఎలాగైతే నిరాహార దీక్షలు చేశారో.. అదే తరహాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టిన రోజున సైతం రాష్ట్ర వ్యప్తంగా పలువురు తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చునే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.