YS Jagan Loss Factor: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఊహించని షాక్ తగిలింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర ఓటమిని చవిచూసింది పార్టీ. కేవలం 11 సీట్లకు పరిమితమైన పార్టీకు లోపం ఎక్కడ జరిగిందో అర్ధం కావడం లేదు. ఓట్ల లెక్కలు పరిశీలిస్తే మాత్రం వైసీపీని దెబ్బకొట్టిన ఓట్ల గురించి తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణాలేంటనేది ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఎవరికి తోచిన కారణాలు వారు చెబుతున్నారు. సంక్షేమం ఓట్లు రాల్చదని కొందరంటుంటే, అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం మరో కారణమంటున్నారు ఇంకొందరు. బీసీ మంత్రం పనిచేయలేదని కొందరి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా అసలు జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకు ఏమైంది, ఎవరి మద్దతు ఎవరికి దక్కింది, కూటమి విజయానికి, వైసీపీ ఓటమికి మధ్య ఓట్ల అంతరం ఎంత ఉందనే లెక్కలు తేలిపోయాయి. ఆ లెక్కలే జగన్‌కు ఎక్కడ తేడా కొట్టిందో చెబుతున్నాయి.
వైసీపీకు పడిన ఓట్లు, ఓట్ల శాతం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కేవలం 11 సీట్లే దక్కించుకున్నా ఓటింగ్ శాతం మాత్రం దాదాపుగా 40 శాతం నమోదు చేసింది. వైసీపీకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 39.37 శాతం. ఓట్లలో చూసుకుంటే ఇది అక్షరాలా 1,32,57,919 ఓట్లు. అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పడిన ఓట్లు 1 కోటి 32 లక్షల 57 వేలు. కానీ వచ్చిన సీట్లు మాత్రం కేవలం 11.
తెలుగుదేశం, జనసేన, బీజేపీకు పడిన ఓట్లు
ఇక తెలుగుదేశం పార్టీకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 45.63 శాతం కాగా 1,53,56,470 మంది ఓట్లేశారు. వచ్చిన సీట్లు మాత్రం 136, అంటే 1 కోటి 53 లక్షల 56 వేల ఓట్లతో సాధించిన సీట్ల సంఖ్య 136. ఇక జనసేనకు 8.3 శాతం మంది అంటే 20 లక్షలమంది ఓట్లు వేశారు. అదే బీజేపీకు 2.80 శాతం మంది అంటే 9.53 లక్షలమంది ఓట్లు వేశారు. 20 లక్షల ఓట్లు తెచ్చుకున్న జనసేన 21 సీట్లు సాధిస్తే కేవలం 10 లక్షల ఓట్లు కూడా పడని బీజేపీ 7 సీట్లు దక్కించుకుంది.
దూరమైన కాపు ఓటర్లు, సహకరించని లబ్దిదారులు
కూటమికి పడిన మొత్తం ఓట్ల సంఖ్య 1,76,62, 470. ఓటింగ్ శాతం చూసుకుంటే 56.73 శాతం ఓట్లు. అంటే కూటమికి వైసీపీకు మధ్య ఓట్ల తేడా దాదాపుగా 44 లక్షలు. ఏపీలో కాపు ఓట్ల సంఖ్య దాదాపుగా ఇంతే ఉంది. కాపులు మొత్తం వైసీపీకు దూరమైపోయారని స్పష్టంగా అర్ధమౌతోంది. ఇక వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకులో కాపులతో పాటు అన్ని వర్గాలున్నాయి. అంటే నమ్ముకున్నసంక్షేమ లబ్దిదారులు కూడా జగన్‌కు వ్యతిరేకమమయ్యారు. అందిన ప్రయోజనం కంటే సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సంక్షేమ పథకాల లబ్దిలో దళిత, మైనార్టీ, బీసీలతో పాటు కాపులు కూడా గణనీయంగా ఉన్నారు.
అన్నింటికంటే ఆశ్చర్యం కల్గించే పరిణామమేంటంటే 1 కోటి 32 లక్షలమంది ఓట్లు సంపాదించుకున్న పార్టీ 11 సీట్లకు పరిమితమైతే, 20 లక్షల ఓట్లు సాధించిన పార్టీ మాత్రం 21 సీట్లు సాధించింది. అదే 20 లక్షల ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే 125 సీట్లు అధికంగా సాధించగలిగింది.
Also read: AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook