ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ సంస్థ తమిళనాడుకు తరలిపోతోందని వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసత్య ప్రచారం వల్ల పజల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. కియా మోటార్స్ తరలింపు నిజం కాదని .. స్వయంగా కంపెనీయే స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం కియా మోటార్స్ విస్తరణ కోసం ప్రణాళికలు జరుగుతుంటే .. కావాలనే తరలిపోతోందని దురుద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కియా యాజమాన్యం పూర్తి సామర్ధ్యంతో పని చేస్తూ కార్లను మార్కెట్ లోకి తీసుకు వస్తుందని చెప్పారు.
మరోవైపు విశాఖలోని మిలేనియం టవర్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఓ ఐటీ సంస్థను ప్రభుత్వం అదేశించినట్టుగా కూడా మీడియాలో కధనాలు వస్తున్నాయని ఆర్ధిక మంత్రి అన్నారు. ఐతే ఇదంతా ప్రచారం మాత్రమేనని .. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాతపూర్వక లావాదేవీలు జరగలేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ప్రచారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2019 నుంచి రాష్ట్రానికి 15,600 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
కియా మోటార్స్ తరలింపుపై వస్తున్నవార్తలు నిజం కాదని అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. సీఎం జగన్ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కియా లాంటి మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో జగన్ ఉన్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందనే పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.
కియా తరలింపు అవాస్తవం