అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో స్థానికులకు, ప్రబోధానంద స్వామి ఆశ్రమ వాసులకు గొడవ జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ గొడవ వల్ల స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు తమ బలగాలను గ్రామానికి తరలించారు. అయితే ఈ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఆరోపించారు. ప్రభోదానంద ఆశ్రమంలో అరాచకాలు జరుగుతున్నాయని.. మరో డేరాబాబా అవతారమే ఈ ప్రభోదానంద అని.. ఆయన ఆశ్రమాన్ని వెంటనే ఖాళీ చేయించాలని ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒక ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యులను ఏం రక్షిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో జేసీ తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని అక్కడ ఆందోళన చేయడం ప్రారంభించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినా సరే జేసీ అందుకు ఒప్పుకోలేదు. గ్రామస్తులకు న్యాయం జరిగే వరకూ తాను అక్కడ నుండి కదలనని జేసీ భీష్మించుకు కూర్చున్నారు.
నిన్న చిన్నపొడమల గ్రామస్తులు గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు.. దారి విషయమై జరిగిన గొడవలో భాగంగా.. ప్రబోధానంద స్వామి ఆశ్రమ భక్తులు స్థానికులపై విరుచుకుపడ్డారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల పాటు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రబోధానంద వర్గీయుల ఆధిపత్య పోరు పెరుగుతోందని.. దీనికి అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరిన నేపథ్యంలో గ్రామంలోకి తన అనుచరులతో అడుగుపెట్టడానికి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.