విజయవాడ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం రాష్ట్రం విడిపోతుందని ఎవరూ ఊహించలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు పడిన శ్రమ, పరిశ్రమ అంతా హైదరాబాద్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఏపీ దగాబడ్డ రాష్ట్రంగా మిగిలిందని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎంతో వెనుకబాటుకు గురైందని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్.. నష్టపోయిన ఏపీని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని.. ఇప్పుడు మనందరి ముందున్న ఏకైక లక్ష్యం అభివృద్ధేనని స్పష్టం చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. మనమంతా కలిసి ముందడుగేసి అభివృద్ధిని సాధిద్దామని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.