అత్యంత పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే పుష్కరాల్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఖరారైంది.
నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకూ 12 రోజుల పాటు జరగనున్న తుంగభద్ర నదీ పుష్కరాల్లో( Tungabhadra River pushkarams ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) పర్యటన ఖరారైంది. నవంబర్ 20 న కర్నూలులోని సంకల్ భాగ్ వీఐపీ ఘాట్‌ను వైఎస్ జగన్ సందర్శించనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యటన కొనసాగనుంది. ముఖ్యమంత్రి సందర్శించే వీఐపీ ఘాట్ లోకి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు తప్ప మరెవ్వరినీ అనుమతించరు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన తరువాతే ఇతరుల్ని ఘాట్‌లోనికి అనుమతిస్తారు. ముఖ్యమంత్రి పుష్కర పర్యటన పురస్కరించుకుని పెండింగ్‌లో ఉన్న పుష్కర ఏర్పాట్ల పనుల్ని రేపటిలోగా పూర్తి చేయనున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను కర్నూలు కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు కమీషనర్ డీకే బాలాజీ తదితరులు పరిశీలించారు. సీఎం కాన్వాయ్ మార్గాన్ని కూడా పరిశీలించారు. నవంబర్ 20న ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు బయలుదేరుతారు. 12 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రోడ్డు మార్గాన సంకల్ భాగ్ పుష్కర్ ఘాట్‌కు చేరుకుంటారు. దాదాపు 2 గంటల వరకూ పుష్కర్ ఘాట్ ( Pushkar Ghat ) లో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని...తిరిగి 2 గంటల 30 నిమిషాలకు విజయవాడకు బయలుదేరిపోతారు. Also read: AP: నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: మంత్రి కొడాలి నాని