World Womens Day: ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రస్తుతం మహిళలు సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తున్నారని వైఎస్ జగన్ ప్రశంసించారు. అందరు మహిళల్లో ఆత్మ విశ్వాసం కన్పిస్తోందన్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో అత్యంత ఘనంగా ప్రభుత్వం..ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించింది. ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా కమీషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 15 వేలమంది మహిళా ప్రజా ప్రతినిధులతో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మహిళలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోందన్నారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా ఉన్నారని ప్రశంసించారు. మహిళా రాజకీయ సాధికారతకు పెద్దపీట వేశామన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్ లో బిల్లులు పెడుతూనే ఉన్నా...ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు. అయితే రాష్ట్రంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత..ఏ ఉద్యమాలు, ఏ నిరసనలు లేకుండానే నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో చట్టం ద్వారా 50 శాతం మహిళలకు కేటాయిస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు.
రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు వైఎస్ జగన్. మహిళలకు 51 శాతం పదవులు కేటాయించడమే కాకుండా మహిళల సంరక్షణకై దేశంలోనే తొలిసారిగా దిశ చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని జడ్పీ ఛైర్మనల్లో 54 శాతం మంది మహిళలే కావడం విశేషమని చెప్పారు.
మహిళా సాధికారత రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి జగన్ వల్లనే సాధ్యమైందని డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ దక్కని గౌరవం ఏపీలో దక్కిందన్నారు. రాష్ట్ర మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సదా రుణపడి ఉంటారన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని మహిళా పార్లమెంట్ సభ్యులు బీవీ సత్యవతి, వంగా గీత, గొట్టేటి మాధవి, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, రజని, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Also read: Inter Hall Tickets: ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook