అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్న టీఆర్ఎస్ పార్టీతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారని, ఇంకా చెప్పాలంటే కేసీఆర్కు భయపడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్పీసీ పోటీ చేయలేదని అన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. తమ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరికీ భయపడకుండా తెలంగాణలోనూ టీడీపీని పోటికి నిలబెట్టి తన ధైర్యాన్ని ప్రదర్శించినందుకు తమకు గర్వంగా ఉందని దేవినేని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ మంత్రి దేవినేని ఉమ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై కేసులు వేసి, ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించిన వారితో జగన్ చేతులు కలుపుతున్నారని.. ఏపీలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న దుష్టశక్తులన్నీ ఏకమవుతున్నాయని, వారికి సహకరిస్తున్న జగన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా దేవినేని ఉమ ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాకు అడ్డం పడిన కుట్రదారులతో కలిసి జగన్ చేస్తున్న రాజకీయాలు సమర్ధించుకోలేనివి అని ఆయన జగన్కు హితవు పలికారు.
ఓవైపు రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం పనులు జరుగుతుంటే.. మరోవైపు జగన్ అనవసరంగా ఆరోపణలు చేస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారని దేవినేని ఉమ ఆరోపించారు.