మోదీ అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ఏమీరావు: జేసీ

కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్‌కి ఏమీ రావని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Updated: Jul 11, 2018, 01:01 PM IST
మోదీ అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ఏమీరావు: జేసీ

కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్‌కి ఏమీ రావని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో చేపట్టిన ఎంపీల ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించడం సరికాదని మండిపడ్డారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం రాష్ట్రానికి శాపమైందని జేసీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి బెల్లం ముక్క కూడా రాదని అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పానని.. అయితే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలన్నారని జేసీ చెప్పారు. దీక్షల వల్ల ఒరిగేదేమీ ఉండదని, ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే దీక్షలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం హామీలిచ్చి మోసం చేయడం న్యాయమా? అని జేసీ ప్రశ్నించారు.

త్వరలో రాజకీయాలకు గుడ్‌బై

వైకాపా అధినేత జగన్‌ తల్లి కడుపులో ఉన్నప్పుడే సీఎం కావాలనుకున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్‌ పుట్టిన వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని జేసీ ఎద్దేవా చేశారు. మోదీ వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  కానీ అది జరిగే పని కాదని అన్నారు.ఈ క్రమంలోనే త్వరలోనే రాజకీయాల నుంచి తాను తప్పుకొంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.