కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న గంపెడు ఆశలు అడిఆశలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్2018పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ పై అభిప్రాయాలను తెలుసుకొనేందుకు చంద్రబాబు నాయుడు పార్టీ మంత్రులు, ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మెజార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీలను కేంద్రం పెడచెవిన పెట్టిందని అధ్యక్షుడికి తెలిపారు.
పోలవరం నిధుల విషయాన్ని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నిధులు, ద్రవ్య లోటు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రైల్వే జోన్ ప్రకటన.. ఇలా పలు హామీలపై బడ్జెట్ సాయాన్ని ఆశించినా.. ఫలితం దక్కలేదు. బడ్జెట్ లో రాష్టానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అర్థమయ్యేలా కేంద్రానికి చెప్పాలని తెదేపా నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావలసిన వాటిపై కేంద్రంతో గట్టిగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు.