CM Jagan Mohan Reddy: క్షేత్రస్థాయిలోకి సీఎం జగన్.. వరద బాధితుల వద్దకు నేరుగా..!

CM Jagan Review Meeting: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని తెలిపారు సీఎం జగన్. వివిధ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 3, 2023, 04:47 PM IST
CM Jagan Mohan Reddy: క్షేత్రస్థాయిలోకి సీఎం జగన్.. వరద బాధితుల వద్దకు నేరుగా..!

CM Jagan Review Meeting: వరద ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్‌ చేస్తున్నామన్నారు. టీఆర్‌-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచిందని అన్నారు. గురువారం వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   

నేను స్వయంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మీరు సహాయ పునరావాస కార్యక్రమాలు ఏ రకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను. ఈసారి కూడా నేను వస్తాను. క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి. ఇంట్లోకి వరద నీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ అందించాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి. ఈ సహాయం అందని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. 

సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000 ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి. వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. వైద్యశిబిరాలను కొనసాగించండి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. పీహెచ్‌సీల్లో, విలేజ్‌ క్లినిక్స్‌లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి.." అని అధికారులకు సీఎం జగన్ సూచించారు. 

పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాను ఉంచాలని ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా పంట నష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించాలని చెప్పారు. అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఏటిగట్ల మీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. పశువులకు గ్రాసం కొరత లేకుండా చూడాలని.. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు.. తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. సోమ, మంగళవారాల్లో తాను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు.

Trending News