కర్నూలు: హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది దసరా నాడు ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు 8 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారనే ఆనవాయితీ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దేవరగట్టు కర్రల సమరంలో భారీ ఎత్తున హింస చోటుచేసుకుంది. ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు రెండు వర్గాలుగా విడిపోయిన వేలాది మంది కర్రలతో కొట్టుకున్నారు.
ఆనవాయితీ పేరుతో జరిగిన ఈ ఉత్సవంలో 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట కొండ ప్రాంతం ఈ కర్రల సమరానికి వేదికైంది. కర్రల సమరం నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని సమాచారం.