ఉద్దానం సమస్యపై 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పలాసలో కిడ్నీ బాధితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 48 గంటల్లో సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాను చేపట్టిన పోరాట యాత్ర ఆపి ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు.
తాను సమస్య తీవ్రతను తెలియజేసే వరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఆ తరువాత ప్రభుత్వంలో కదలిక వచ్చినా అది ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. గోడు చెప్పుకోవడానికి ఆరోగ్య మంత్రి లేకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆరోగ్య మంత్రిని నియమించి కిడ్నీ సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. కిడ్నీ వ్యాధులపై రీసర్చ్ వర్క్ జరగాలని, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు కావాలని అన్నారు.