AP: అధికార పార్టీకి రాజమండ్రిలో దిక్కెవరు, ముఖ్యమంత్రి జగన్ కూడా చేతులెత్తేశారా

AP: రాష్ట్రమంతా ఓ ఎత్తైతే..రాజమండ్రి నగరం పరిస్థితి మరో తీరు. రాష్ట్రమంతా బలంగా ఉన్న అధికార పార్టీకు నగరంలో నాయకుడు కరువయ్యాడు. 2024కు సరైన అభ్యర్ధే కన్పించని పరిస్థితి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2022, 09:52 PM IST
AP: అధికార పార్టీకి రాజమండ్రిలో దిక్కెవరు, ముఖ్యమంత్రి జగన్ కూడా చేతులెత్తేశారా

AP: రాష్ట్రమంతా ఓ ఎత్తైతే..రాజమండ్రి నగరం పరిస్థితి మరో తీరు. రాష్ట్రమంతా బలంగా ఉన్న అధికార పార్టీకు నగరంలో నాయకుడు కరువయ్యాడు. 2024కు సరైన అభ్యర్ధే కన్పించని పరిస్థితి.

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు మెజార్టీ సీట్లు అందించింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు. కానీ ఈ రెండు జిల్లాల్లో ప్రధాన నగరమైన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్ని మాత్రం భారీ తేడాతో ఓడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇది కేవలం 2019 పరిస్థితే కాదు..ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పటికీ రాజమండ్రి సిటీ, రూరల్ స్థానాల్లో పార్టీకు సరైన నాయకుడే కరువయ్యాడు. రాజమండ్రి సిటీకైతే కో ఆర్డినేటరే లేని దయనీయ పరిస్థితి. 

రాజమండ్రి సిటీ, రూరల్ విషయంలో పార్టీ దయనీయ పరిస్థితి కారణం గ్రూపు రాజకీయాలు, సరైన నాయకుడు లేకపోవడమే. రాజమండ్రి సిటీకు కో ఆర్డినేటర్లుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్య ప్రకాశరావు, ఆకుల సత్యనారాయణతో పాటు మరో నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యంలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వీరిలో ఆకుల సత్యనారాయణ, శివరామ సుబ్రహ్మణ్యంలు పూర్తిగా పార్టీకు దూరంగా ఉండగా..మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

జక్కంపూడి రాజా వర్సెస్ మార్గాని భరత్

ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల ఆధిపత్యపోరులో మిగిలిన నేతలు, కార్యకర్తలు, సిట్టింగ్ కార్పొరేటర్లు నలిగిపోతున్నారు. ఈ ఇద్దరి మధ్య పంచాయితీ 2-3 సార్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ వద్దకు కూడా వెళ్లింది. ఇద్దరూ కలిసి ప్రయాణించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే చెప్పినా..ఇరువురికీ తలకెక్కడం లేదు. ఈ పరిస్థితి ఇప్పటిది కాదు..గతంలో కూడా ఇదే పరిస్థితి. అందుకే వరుసగా 2014, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్ధులు భారీ ఆధిక్యంతో విజయం సాధించిన పరిస్థితి. రాజమండ్రి సిటీలో ఇప్పటికీ అన్ని డివిజన్లకు ఇన్‌ఛార్జ్‌లు లేరంటే అతిశయోక్తి కాదు.

2024 పరిస్థితి ఏంటి

ఇప్పటికే ఈ రెండు స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కోల్పోయింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అంటే 2024 లో కూడా గెలిచే పరిస్థితులు కన్పించడం లేదు. కారణం ఇప్పటికీ సరైన నాయకుడు లేకపోవడమే. కుల సమీకరణాల నేపధ్యంలో వైసీపీలో రాజమండ్రి సిటీ సీటు ఎవరికనేది ఇంకా సందేహమే. ఎందుకంటే రాజమండ్రికి మరో పక్కనున్న రాజానగరం సీటు మరోసారి కాపు సామాజికవర్గానికి చెందిన జక్కంపూడి రాజాకు దక్కనుంది. రాజమండ్రి రూరల్ సీటు నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన చందన నాగేశ్వరరావు బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో రాజమండ్రి సిటీ నుంచి ఎవరిని బరిలో దింపుతారనేది తెలియడం లేదు. సరైన నాయకుడే కన్పించడం లేదు. 

ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా అభ్యర్ధిని పార్టీ రంగంలో దింపినా..ప్రయోజనముండదు. కారణం గ్రూపు రాజకీయాల కారణంగా ఉన్న నాయకులు సహకరించని పరిస్థితి. ఈ కారణంతోనే గతంలో రెండుసార్లు పార్టీ ఓటమి పాలైంది. రాజమండ్రి రాజకీయాల విషయంలో స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ చేతులెత్తేసిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రమంతా రాజకీయం చేస్తాను గానీ..రాజమండ్రి రాజకీయం నా వల్ల కాదని అన్నట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో 175/175 స్థానాలు టార్గెట్‌గా పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాలు మరోసారి చేజారే అవకాశాలు లేకపోలేదు. రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ భరత్ దిగనున్నారనే వార్తలు వస్తున్నా..మరోసారి ఎంపీగానే నిలబడేందుకు భరత్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. 

Also read: AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News