కర్నూలు జిల్లా క్వారీలో భారీ పేలుడు.. 11 మంది మృతి

కర్నూలు జిల్లా  ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో ఓ క్వారీలో భారీ పేలుడు ప్రమాదం సంభవించింది.

Last Updated : Aug 4, 2018, 03:26 PM IST
కర్నూలు జిల్లా క్వారీలో భారీ పేలుడు.. 11 మంది మృతి

కర్నూలు జిల్లా  ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో ఓ క్వారీలో భారీ పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో.. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్‌లోనే 11 మంది కూలీలు మరణించగా.. మిగతా క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్‌లో 20 మంది కూలీలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆ పనిచేస్తున్న కూలీలందరూ కూడా ఒరిస్సా ప్రాంతం వారని తెలుస్తోంది.

క్వారీలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా పేలుడు సంభవించి మంటలు చెలరేగగా.. అవే మంటలు దగ్గరలో ఉన్న ట్రాక్టర్లు, లారీలకు, షెడ్డుకు కూడా అంటుకోవడంతో.. అదే షెడ్డులో ఉన్న కూలీలు ఎటు వెళ్లాలో తెలియక కాస్తా అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందగానే అగ్నిమాపక దళాలు హుటాహుటిన పేలుడు జరిగిన ప్రాంతానికి చేరాయి. ఈ పేలుడు ధాటికి హత్తిబెళ‌గ‌ల్‌లో 10 ఇళ్లు కూడా కూలిపోయాయి. తొలుత భూకంపం వచ్చిందని అనుమానించిన జనాలు భయాందోళనలకు గురై ఎటు పెడితే అటు పరుగులు తీశారు. ఆ తర్వాత పేలుడు విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి భారీగా జనాలు తరలి వచ్చారు.

ఈ పేలుడు ప్రమాదం వార్త పై సీఎంఓ ఆఫీసు స్పందించింది. ఈ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టరును, అధికారులను ఆదేశించారు. ఈ భారీ పేలుడు ప్రమాదం దాదాపు 20 కిలో మీటర్ల దూరం వరకూ ప్రభావం చూపించింది. 

Trending News