జేసి దివాకర్ రెడ్డి కుమార్తె, కోడలుకు హైకోర్టు నోటీసులు

జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి కుమార్తె, జేసి కోడలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated: Nov 27, 2019, 03:55 PM IST
జేసి దివాకర్ రెడ్డి కుమార్తె, కోడలుకు హైకోర్టు నోటీసులు
జేసి దివాకర్ రెడ్డి ఫైల్ ఫోటో

అమరావతి: మాజీ ఎంపి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టు(AP High court)లో చుక్కెదురైంది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy) కుమార్తె, జేసి కోడలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. జేసీ దివాకర్ రెడ్డి కుమార్తె, కోడలు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నందునే కోర్టు వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. లైమ్ స్టోన్ గనుల లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ఈ నోటీసుల ద్వారా జేసి కుమార్తె, కోడలును ప్రశ్నించిన కోర్టు... తదుపరి విచారణను డిసెంబర్‌ 30వ తేదీకి వాయిదా వేసింది. కుటుంబసభ్యులు, ఇతరుల పేరిట జేసి దివాకర్ రెడ్డి బినామీ దందా చేస్తున్నారని 2011లోనే తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి ఆరోపించారు. హై కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఇటీవల దివాకర్ రెడ్డికి చెందిన పలు ట్రావెల్స్ బస్సులను సైతం రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ నిబంధనలకు అనుగుణంగా డాక్యుమెంట్స్ లేనందునే ఆ బస్సులను సీజ్ చేసినట్టు అప్పట్లో అధికారులు వెల్లడించారు.