తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరో కమల్ హాసన్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీకి నామకరణం కూడా చేశారు. కమల్ హాసన్ తన రాజకీయ పార్టీకి 'మక్కళ్ నీది మయ్యమ్' అనే పేరు పెట్టారు. తమిళంలో మక్కళ్ నీది మయ్యమ్ అంటే జస్టిస్ ఫర్ పీపుల్ అని అర్థం. తమిళనాడులోని మదురైలో ఒత్తకడై మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కమల్ హాసన్ తన పొలిటికల్ పార్టీ పేరుని ప్రకటించి, పార్టీ జండాను ఆవిష్కరించారు. కమల్ హాసన్ పార్టీ ఆవిర్భావ సభకు వేల సంఖ్యలో కమల్ అభిమానులు హాజరయ్యారు.
కమల్ ఆవిష్కరించిన తన పార్టీ జండాలో తెలుపు రంగు ఎరుపు, నలుపు రంగు మిళితమైన ఉన్నాయి. తెలుపు శాంతికి చిహ్నం కాగా జండాపై కనిపిస్తున్న చేయి చేయి కలిపి ఉన్న గుర్తు పరస్పర సహకారానికి సంకేతంగా నిలుస్తోంది. కమల్ హాసన్ పార్టీ ఆవిర్భావ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరవడం గమనార్హం.
అరవింద్ కేజ్రీవాల్ రాకతో భవిష్యత్లో కమల్ ఆమ్ ఆద్మీ పార్టీతో జత కడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే, పార్టీ ప్రకటనకన్నా ముందుగా మాట్లాడిన కమల్ హాసన్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఆదర్శం అని చెప్పిన సంగతి తెలిసిందే.