నందమూరి హరికృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం

నందమూరి హరికృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం

Last Updated : Aug 29, 2018, 02:48 PM IST
నందమూరి హరికృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం

బుధవారం (29-8-2018) ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం కావడంతో వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో.. నారా, నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి బయల్దేరారు. దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయల్దేరారు.

హరికృష్ణ రోడ్డు ప్రమాద వార్త తెలియగానే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కామినేని ఆస్పత్రికి బయల్దేరారు. కొద్దిసేపటి క్రితం కామినేని ఆస్పత్రికి వచ్చిన వారు నందమూరి హరికృష్ణ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఆసుపత్రిలో వారు విషణ్ణ వదనంతో నిలబడిపోవడం కనిపించింది.

సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హరికృష్ణ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త విని కామినేని ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందడం పట్ల చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదం వార్త విని షాక్‌కు గురయ్యారన్నారు.

సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సినీనటుడు హరికృష్ణ మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు జగన్‌ సానుభూతి తెలిపారు.

 

Trending News