అమరావతి: ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషన్లకు ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో సమావేశమైన ఎంసెట్-2019 అడ్మిషన్ల కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాంకేతిక విద్య కమిషనర్ కాంతిలాల్ దండే నేతృత్వంలో సమావేశమైన కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం జూలై 1న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుండగా జూలై 4 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులకు వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 10వ తేదీన సీట్లు కేటాయించడం జరుగుతుంది. జూన్ నెలాఖరులో జేఈఈ- మెయిన్స్ ర్యాంకర్లకు నాలుగు రౌండ్ల ఎన్ఐటీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
ఎంసెట్లో 1.22 లక్షల మంది అర్హత సాధించగా వారిలో దాదాపు 92,000 మంది సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మిగిలిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అంతగా సమయం పట్టకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.